Home Entertainment వెబ్ చిత్రాల వైపుగా ముద్దుగుమ్మ‌లు

వెబ్ చిత్రాల వైపుగా ముద్దుగుమ్మ‌లు

293
0

ప్రేమకథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టింది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. ఎనిమిదేళ్ల కెరీర్‌లో వాణిజ్య ప్రధాన చిత్రాల్లో ఎక్కువగా మెరిసిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లుగా కొత్త దారుల్లో అడుగులు వేస్తోంది. పాత్రల పరంగా తనను తాను నవ్యరీతిలో ఆవిష్కరించుకునే అవకాశాలు సినిమాల్లో అరుదుగా లభిస్తుండటంతో వెబ్‌సిరీస్‌లపై దృష్టిపెట్టింది రాశీఖన్నా. ప్రస్తుతం రెండు సిరీస్‌లలో నటిస్తుంది. ‘ఫ్యామిలీమాన్‌’ రెండు సీజన్‌లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న రాజ్‌, డీకే నిర్దేశకత్వంలో షాహిద్‌కపూర్‌ ప్రధాన పాత్రలో హిందీలో ఓ వెబ్‌సిరీస్‌ రూపొందుతోంది. డార్క్‌ క్రైమ్‌ కామెడీ కథాంశంతో రూపొందుతున్న ఈ సిరీస్‌ ద్వారా రాశీఖన్నా వెబ్‌ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఇందులో ప్రయోగాత్మక పంథాలో ఆమె పాత్ర సాగుతుందని దర్శకద్వయం రాజ్‌, డీకే చెబుతున్నారు. బాలీవుడ్‌ అగ్ర హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ కెరీర్‌లో తొలిసారి ‘రుద్ర’ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ చేస్తున్నారు. ఆయన నటించనున్న తొలి సిరీస్‌ ఇదే కావడం విశేషం. ఇందులో రాశీఖన్నా కథానాయికగా నటిస్తోంది. వరుస హత్యలకు పాల్పడే సైకో కిల్లర్‌గా వైవిధ్యమైన పాత్రలో ఆమె కనిపించబోతున్నది. భవిష్యత్తులో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రెండింటికి సమప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తానని చెబుతోంది రాశీఖన్నా.

గత కొన్నేళ్లుగా వెండితెరపై సవాళ్లతో కూడిన పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది చెన్నై సుందరి రెజీనా. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ సొగసరి ‘అన్యాస్‌ ట్యూటోరియల్‌’ పేరుతో తెలుగులో మొదటిసారి వెబ్‌సిరీస్‌ చేయబోతున్నది. హారర్‌, థ్రిల్లర్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సిరీస్‌లో ఆత్మల కారణంగా ఇబ్బందులు పడే అన్య అనే వెబ్‌ఛానెల్‌ అధినేత్రిగా రెజీనా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నది. పల్లవి గంగిరెడ్డి ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ‘కుడి ఎడమైతే’ సిరీస్‌లో పోలీస్‌ అధికారి పాత్రలో విలక్షణ అభినయంతో మెప్పించింది అమలాపాల్‌. ఈ సిరీస్‌తో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లోకి అరంగేట్రం చేసిన అమలాపాల్‌ తొలి అడుగులోనే విజయాన్ని దక్కించుకున్నది. హిందీలో మహేష్‌భట్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సిరీస్‌లో అమలాపాల్‌ కీలక పాత్రలో నటిస్తోంది. సినీ కెరీర్‌ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ దర్శకుడికి, అగ్ర తారకు మధ్య సాగే ప్రేమకథతో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా ఈ సిరీస్‌ తెరకెక్కుతోంది. విలక్షణ చిత్రాల దర్శకుడు మణిరత్నం నిర్మాణంలోరూపొందిన ‘నవరస’ సిరీస్‌తో అగ్రహీరో సూర్య, కథానాయిక అంజలి, అధర్వమురళి సహా పలువురు అగ్ర నాయకానాయికలు వెబ్‌ ప్లాట్‌ఫామ్‌లోకి అరంగేట్రం చేశారు. నవరసాల్ని ఆవిష్కరిస్తూ ఉద్వేగభరితంగా తొమ్మిది ఎపిసోడ్స్‌తో తెరకెక్కిన ఈ సిరీస్‌ ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా విడుదలైంది. గత ఏడాది విడుదలైన ‘కన్నమూచి’ సిరీస్‌తో పూర్ణ తొలిసారి వెబ్‌మాధ్యమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నది. హారర్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ‘నవరస’ సిరీస్‌లో కీలక పాత్రలో నటించింది. వీరితో పాటు పలువురు నాయకానాయికలు వెబ్‌సిరీస్‌లో నటిస్తూ తమ ప్రతిభాపాటవాల్ని నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here