ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టినందుకుగాను మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసలు జల్లు కురిపించిన విషయం తెలిసిందే. చిరంజీవి ట్వీట్‌పై సీఎం జగన్ ట్విటర్లో స్పందించారు. ఏపీ ప్రభుత్వం తరపున చిరంజీవికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క రోజే రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడానికి ప్రభుత్వ యంత్రాంగం సమష్టి కృషి ఎంతగానో ఉందని పేర్కొన్నారు.
గ్రామ వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, వైద్యులు, మండల, జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్లు, కలెక్లర్లు అందరి సహకారంతో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతమైందని సీఎం జగన్ తెలిపారు. కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం జూన్ 20 న ఒక్కరోజే 13 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ అందించింది. వాస్తవానికి ఒక్క రోజు 8 లక్షల మంది వ్యాక్సిన్ వేయాలని లక్ష్యాన్ని ముందుగా నిర్దేశించుకున్నారు. దాన్ని అధిగమిస్తూ.. ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు.