Home Entertainment హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు రిలీజ్ అప్పుడేన‌ట‌

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు రిలీజ్ అప్పుడేన‌ట‌

507
0

ఈ మధ్యే రిలీజైన ‘హరిహర వీరమల్లు’ టీజర్ చూశాక అందరూ విస్మయానికి గురయ్యారు. పవన్ కెరీర్లో ‘బాహుబలి’ లాంటి సినిమా అవుతుందన్న అంచనాలు రేకెత్తించింది ఆ టీజర్.

విలక్షణ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. ‘ఖుషి’తో పవన్‌కు మరపురాని విజయాన్నందించి సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నాడు. మధ్యలో చాలా ఏళ్లు టాలీవుడ్‌కు దూరమైన రత్నం.. మళ్లీ ఈ చిత్రంతో లైమ్ లైట్లోకి రావాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ గురించి వీలు చిక్కినపుడల్లా మీడియాతో మాట్లాడుతున్నాడు. ఆయన మరోసారి ఈ సినిమా గురించి మీడియాతో కొన్ని విశేషాలు పంచుకున్నాడు. షూటింగ్, రిలీజ్ గురించి అప్‌డేట్స్ ఇచ్చాడు.

పవన్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రంగా ‘హరిహర వీరమల్లు’ను తీర్చదిద్దుతున్నామని.. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయిందని రత్నం వెల్లడించాడు. చివరగా చేసిన షెడ్యూల్లో భాగంగా ఏప్రిల్ 6వ తేదీ వరకు షూటింగ్ జరిపామని.. తర్వాత పవన్ కరోనా బారిన పడటం, అలాగే లాక్ డౌన్ కారణంగా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టలేకపోయామని రత్నం తెలిపాడు.

ప్రస్తుతం పవన్ సెట్లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని.. కొత్త షెడ్యూల్లో బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్జున్ రాంపాల్ సైతం జాయిన్ అవుతారని రత్నం చెప్పాడు. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ చేస్తున్నది ఔరంగజేబు పాత్ర అని కూడా ఆయన వెల్లడించాడు. 17వ శతాబ్ధంలో సాగే చిత్రం కావడంతో ఎక్కువశాతం సెట్స్‌లోనే షూటింగ్‌ ఉంటోందని.. రాజీవన్‌ నేతృత్వంలో అద్భుతమైన సెట్లు సిద్ధమయ్యాయని రత్నం వివరించాడు.

తనకు సినిమా గొప్పగా రావాలన్న తపన తప్ప బడ్జెట్ గురించి ఆలోచన ఉండదని.. ‘హరిహర వీరమల్లు’ కథ దృష్ట్యా దీనికి భారీ బడ్జెట్ అవుతుందన్న అంచనా ముందే ఉందని రత్నం అన్నాడు. పవన్ తమ చిత్రంతో పాటు ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లోనూ సమాంతరంగా నటిస్తాడని.. ‘హరిహర వీరమల్లు’ను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ఆలోచనతోనే ఇప్పటికీ ఉన్నామని.. ఏం జరుగుతుందో చూడాలని రత్నం వ్యాఖ్యానించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here