Home movie news 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న – శంకరాభరణం

42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న – శంకరాభరణం

173
0

తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం,”శంకరాభరణం”
చిత్రం విడుదలయ్యి నేటికి 42 సంవత్సరాలు పూర్తయ్యింది. ఫిబ్రవరి 2 , 1980 వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో విడుదలయ్యింది . కళా తపస్వి శ్రీ కే.విశ్వనాధ్ దర్శకత్వంలో , పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై శ్రీ ఏడిద నాగేశ్వరరావు – ఆకాశం శ్రీరాములు నిర్మించారు . ఈ చిత్రం ఇక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, పక్క రాష్ట్రాలైన తమిళనాడు , కర్ణాటక & కేరళ ల్లో కూడా అఖండ విజయం సాధించింది . అమెరికా లో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్ట మొదటి చిత్రం ఇదే. అలాగే ప్రపంచ  నలు మూలల్లో ఎన్నో దేశాల్లో విడుదలయ్యి, తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది ఈ చిత్రం. ఆ రోజుల్లో ఎవరి నోట విన్నా శంకరాభరణం గురించే ప్రస్తావన . శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో , ఈ చిత్రం విడుదల తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు . ప్రతి తెలుగు వాడు మా సినిమా అని గర్వంగా చెప్పుకొనేవారు.
ఇక అవార్డుల విషయానికి వస్తే , జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు , వినోదాత్మకం తో  కూడిన జనరంజక చిత్రంగా స్వర్ణ కమలం అందుకుంది. తెలుగులో స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. అలాగే గాయకులు శ్రీ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కు ఉత్తమ నేపధ్య గాయకునిగా తొలి సారి జాతీయ అవార్డు , శ్రీమతి వాణి జయరాం కు ఉత్తమ గాయకురాలు గా ,
శ్రీ కే.వి.మహదేవన్ ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డులు అందుకున్నారు . Besancon ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ( ఫ్రాన్స్ ) లో ఉత్తమ చిత్రంగా అంతర్జాతీయ అవార్డు అందుకున్నది. అలాగే మన ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డులు 8  గెలుచుకుంది . ఇక దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి . శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు శంకరాభరణం చిత్రంపై మూడు రోజులు ప్రవచనాలు కార్యక్రమం చేసారు , అలా ఓ చిత్రంపై ప్రవచనం నిర్వహించటం అదే మెదటి సారి. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకు వచ్చిందీ చిత్రం. జె.వి. సోమయాజులు గార్ని అందరూ శంకరాభరణం శంకరశాస్త్రి అనే పిలిచేవారు . అలాగే వాంప్ పాత్రలు ఎక్కువగా చేసే మంజు భార్గవి చాలా పవిత్రమైమ తులసి పాత్రలో లీనమైపోయింది . ప్రముఖ హాస్య నటులు శ్రీ అల్లు రామలింగయ్య ఓ కీలక పాత్ర పోషించారు . ఈ చిత్ర పాటలు ఇప్పటికీ భాష తో సంబంధం లేకుండా అందరూ పాడుతూనే ఉంటారు . ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తాను చెన్నై & హైదరాబాద్ లో నిర్మించిన ఇళ్లకు శంకరాభరణం అనే పేరు పెట్టుకున్నారు . 42 ఏళ్ళు గడిచినా , ఇంకా ఈ చిత్రం ఏదో మాధ్యమంలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here