మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభిమానులతో భేటి అయ్యారు. సామాజిక కార్యక్రమాలను నిర్వహించడంలో కష్టంలో ఉన్న బాధితులకు అండగా నిలబడడంలో మెగాస్టార్ ముందుంటారని అందరికీ తెలిసిన విషయమే. తన అభిమానులను కలుపుకుని సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లు వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మంది బాధితులకు చిరంజీవి అండగా నిలిచారు. ఇక కరోనా క్రైసిస్‌లో ఎంతోమందికి సాయం చేశారు..
లాక్డౌన్ సమయంలో సీసీసీ అనే సంస్థను ప్రారంభించి ఇతర సినీ ప్రముఖుల సపోర్టుతో సినీ కార్మికులకు అండగా నిలబడ్డారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కరోనా కష్ట కాలంలో ఆక్సిజన్ బ్యాంక్‌తో ముందుకొచ్చి.. కరోనా బారిన పడ్డ బాధితుడు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం ఈ సేవల్ని తీసుకువచ్చారు. ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని బ్లడ్ బ్యాంక్‌లో తెలంగాణకు చెందిన అభిమానులతో చిరు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఎంతో మంది చనిపోయారు.. ఈ దశలో అభిమానుల్ని కోల్పోవడం దురదృష్టకరం. ఆక్సిజన్ అందక గొల్లపల్లిలో చాలా మంది మరణించారు. ఆ ఘటనతోనే ఆక్సిజన్ బ్యాంక్ ఆలోచన వచ్చింది. దుబాయ్, గుజరాత్, వైజాగ్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించాం. రెండో దశలో 3వేలకు పైగా సిలిండర్లు తయారు చేయించాం. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ బ్యాంకుల నిర్వహణలో అభిమానుల సేవలు గర్వకారణమని చిరంజీవి తెలిపారు.