మా అసోసియేషన్‌కు నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తన ప్యానెల్ లో గెలిచిన 15మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రాఫర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ…
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలపించేలా ఈ సారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు లాంటి యువకుడిని, తన ప్యానెల్‌ని ఎన్నుకున్న మా సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. మా అసోసియేషన్ అంటే చిన్న వ్యవస్థ కాదు.. కుటుంబం కాదు.. ఇది ఒక పెద్ద వ్యవస్థ అలాంటి వ్యవస్థ అభివృద్ధిని తన భుజాలపై వేసుకుని మా సభ్యుల సంక్షేమం కోసం పాటు పడడానికి ఆయన ముందుకు వచ్చి మా ఎలక్షన్స్‌లో నిలబడడం గర్వించదగ్గ విషయం. అలాగే దాదాపు 23 సంవత్సరాల నుంచి మోహన్‌బాబుకీ, నాకూ అన్నదమ్ముల అనుబంధం ఉంది.
మోహన్‌బాబుకీ కోపం ఎక్కువ అని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు.. నిజం చెప్పాలంటే ఆ కోపంతో ఆయన ఎంతో నష్టపోయాడు. ఆ విషయం ఆయన మనసుకు కూడా తెలుసు. సమాజ హితం కోసం ఆయన మాట్లాడతాడు. వ్యక్తిగత లాభం కోసం ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. ఇక మంచు విష్ణుకి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ హబ్‌గా ఉండాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు.. సినిమా షూటింగ్‌ల కోసం అనువుగా ఉండే ఎన్నో ప్రదేశాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని తలసాని పేర్కొన్నారు.