మా అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాశ్‌రాజ్‌పై 100పైగా ఓట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న మంచు విష్ణు నేడు ఉదయం 11:30 నిమిషాలకు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా మంచు విష్ణు ప్యానెల్ నుంచి గెలుపొందిన 15మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొని కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. కాగా ప్రమాణ స్వీకారం ముందు విష్ణు టీం పూజా కార్యక్రమం నిర్వహించారు. నరేశ్, శివబాలాజీతో పాటు ఆయన సతీమణీ, మాదాల రవి తదితరులు పూజలో పాల్గొన్నారు. ఇక ప్రమాణ స్వీకారత్సోవానికి ప్రకాశ్‌రాజ్ తన ప్యానెల్ సభ్యులు ఎవరూ కూడా హాజరుకాలేదు. ప్రకాశ్‌రాజ్-మంచువిష్ణుల మధ్య మాటల దాడి జరిగిన విషయం తెలిసిందే.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి 11మంది సభ్యులు గెలిచినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల వారి పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు ఇటీవలే నటసింహం బాలకృష్ణను డైలాగ్ కింగ్ మోహన్‌బాబుతో కలిసి మంచు విష్ణు భేటి అయి ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు.. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరినీ కలుపుకుపోయి మా అసోసియేషన్‌ను అభివృద్ధి చేస్తానని తెలిపాడు..
అలాగే మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తానని తెలిపాడు… కానీ మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. అలాగే ఇటీవలే మంచు మనోజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్‌ను భీమ్లానాయక్ మూవీ సెట్స్‌లో కలిసిన విషయం తెలిసిందే.