సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. ఎప్పుడు సోషల్ మీడియాలో హడావిడిగా ఉండే సినీ తారలందరూ స్పందించకుండా కనుమరుగైపోతున్నారు. సుశాంత్ మరణం కేసు అనేక మలుపులు తిరగడం, బాలీవుడ్ ప్రముఖుల వల్లనే అతడి మరణం సంభవించిందనే ఆరోపణలు రావడంపై సినీ ప్రముఖులు స్పందించడానికి వెనుకాడుతున్నారు. అయితే సినీ ప్రముఖుల మౌనం వెనుక తలెత్తుతున్న ప్రశ్నలు ఏమిటంటే..
డ్రగ్స్ రాకెట్లో అగ్ర తారల పేర్లు ఇప్పుడు సుశాంత్ కేసుతోపాటు డ్రగ్స్ రాకెట్ వ్యవహారం తెరపైకి రావడం, అందులో బాలీవుడ్‌కు చెందిన అగ్ర తారలకు కూడా సంబంధాలు ఉన్నాయనే విషయం సంచలనం రేపుతున్నది. దీపిక పదుకోన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీ ఖాన్ లాంటి వాళ్ల పేర్లు బయటకు రావడంతో బాలీవుడ్ ప్రముఖులు ఇంకా ఆత్మ సంరక్షణలో పడ్డారు.
సుశాంత్ మరణం, డ్రగ్స్ కేసుల తర్వాత సుశాంత్ సింగ్ మరణంపై గానీ, డ్రగ్స్ కేసు విచారణ గురించి అమితాబ్ బచ్చన్, రణ్వీర్ సింగ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్లు సోషల్ మీడియాలో స్పందించడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. ఇలా బాలీవుడ్ స్టార్లు ముఖం చాటేస్తున్న తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
అమితాబ్ మినహాయిస్తే.. సల్మాన్, షారుక్.. బాలీవుడ్ తారల్లో అమితాబ్ బచ్చన్ ఒక్కరే ఈ కేసుల విషయాలు కాకుండా క్రికెట్, కేబీసీ లాంటి సాధారణ విషయాలను అభిమానులతో పంచుకొంటున్నారు. ఇక షారుక్ ఖాన్ అడపాదడపా ట్వీట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతున్నారు. సల్మాన్ ఖాన్ తన ఫామ్‌హౌస్‌లోని ఫోటోలను కొద్ది రోజుల క్రితం వరకు షేర్ చేశారు. రణ్వీర్, సింగ్, ఆయుష్మాన్ ఖురానా లాంటి వాళ్ల జాడ కనిపించడం లేదు.
కంగన రనౌత్ జోరు.. ఇక లాక్డౌన్ నుంచి మొదలుకొని సుశాంత్ కేసు, డ్రగ్స్ రాకెట్, తన ఇంటిని బీఎంసీ ధ్వంసం చేయడం వరకు కంగన రనౌత్ తన సోషల్ మీడియా టీమ్, తన అకౌంట్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రోజులో కనీసం నాలుగైదు ట్వీట్లతో దడదడలాడిస్తున్నారు. నెటిజన్లు చేసే ట్రోలింగ్‌ను ధీటుగా ఎదుర్కొంటున్నారు. శివసేన నాయకులు చేసే ఆరోపణలకు ఘాటుగా జవాబిస్తున్నారు.
కరణ్ జోహర్, ఆలియాఫై భారీగా ప్రభావం హీరోయిన్ల విషయానికి వస్తే.. సారా ఆలీ ఖాన్, ఆలియా భట్, సోనమ్ కపూర్ లాంటి హీరోయిన్లు దాదాపు సోషల్ మీడియాను వదిలేసినట్టే కనిపిస్తున్నారు. సుశాంత్ మరణం తర్వాత వారిపై వ్యతిరేకత రావడంతో సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. భారీ సంఖ్యలో నెటిజన్లు వారి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి అన్‌ఫాలో అవుతున్నారు. ఈ వ్యవహారంలో చాలా ఎక్కువ దెబ్బ పడింది కరణ్ జోహర్పైనే అనే మాట వినిపిస్తున్నది.