ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీనియర్ నేతలపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తాను అప్పగించిన పనులను పారదర్శకంగా చేయకుండా వ్యక్తిగత ప్రయోజనాలు ఆశిస్తుండమేంటని నిలదీసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు బాధ్యతలను అప్పగించారు.
ఫిర్యాదులు అందడంతో…..
అయితే అనేక నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రికి నామినేటెడ్ పదవుల విషయంలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కాదని అక్కడ పెత్తనం చేస్తున్న వైసీపీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించి నామినేటెడ్ పదవుల జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే జాబితను చూసిన జగన్ ఇది మంచి పద్ధతి కాదని సీనియర్ నేతలను హెచ్చరించినట్లు తెలిసింది.
ఎస్సీ నియోజకవర్గాల్లో….
రాష్ట్రంలో మొత్తం 56 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవులను భర్తీ చేయాలి. ఇందుకోసం జిల్లాల వారీగా తిరిగి ఎమ్మెల్యేలు, స్థానిక నేతల అభిప్రాయాలను సేకరించి పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారి జాబితాను రూపొందించాలని జగన్ ఆదేశించారు. ఈమేరకు సీనియర్ నేతలు జాబితాను రూపొందించారు. అయితే ఎస్సీ నియోజకవర్గాల్లో తమ అభిప్రాయాలను తీసుకోలేదని జగన్ కు ఫిర్యాదు చేశారు. జగన్ కు సన్నిహితంగా ఉండే ఒక ఎమ్మెల్యే దీనిపై ఫిర్యాదు చేయడంతో ఆయన దృష్టికి వచ్చింది.
సీరియస్ గానే ప్రశ్నించడంతో…..
ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని జగన్ కొంత కటువుగానే ప్రశ్నించినట్లు తెలిసింది. .అలాగే మొత్తం పదవుల్లో యాభై శాతం మహిళల పేర్లు ఎందుకు సిఫార్సు చేయలేదని కూడా జగన్ వారిని నిలదీసినట్లు సమాచారం. దీంతో అవాక్కయిన నేతలు మరోసారి జాబితాను రూపొందిస్తామని అక్కడి నుంచి బయటపడినట్లు చెబుతున్నారు. మొత్తం మీద నామినేటెడ్ పోస్టుల విషయంలో కొందరి అభిప్రాయాలకే ప్రాధాన్యత దక్కడంపై జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.