Home gossips జగన్ తో బొత్సకు పెద్ద గ్యాప్ ?

జగన్ తో బొత్సకు పెద్ద గ్యాప్ ?

607
0

వైసీపీలో ఇపుడు దీని మీదనే హాట్ హాట్ చర్చ సాగుతోంది. జగన్ కి బొత్స సత్యనారాయణకు మధ్య చెడిందన్న ప్రచారం కూడా సాగుతోంది. బొత్స పార్టీలో హై హ్యాండ్ గా బిహేవ్ చేయడం, తానే పెద్ద దిక్కు అన్నట్లుగా చాటుకోవడం మొదటి నుంచి జగన్ కి ఇష్టంలేని వ్యవహారమే. అయితే ఎన్నికల తరువాత ఆయనకు అన్యాయం చేశారన్న విమర్శలు రానీయకూడదని కీలకమైన మంత్రిత్వ శాఖలతో సీనియర్ మంత్రి పదవి ఇచ్చారు. అయితే బొత్స సత్యనారాయణ అంతటితో ఊరుకోకుండా ప్రతీ దాంట్లోనూ వేలు పెడుతున్నారని, జగన్ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాల్లోనూ తన చేతి వాటం చూపిస్తున్నారని వైసీపీలో విమర్శలు ఉన్నాయట.

అదే రీజనా….

ఎంత కాదనుకున్నా విజయసాయిరెడ్డి వైఎస్సార్ కుటుంబానికి మూడు తరాల నుంచి దగ్గరవారు. ఆయన్ని జగన్ దూరం చేసుకుంటారని ఎలా ఊహించారో కానీ బొత్స సత్యనారాయణ ఏకంగా విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగానే పావులు కదిపారు. అది కూడా వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డితో కలసి ఝలక్ ఇద్దామనుకున్నారు. తన సన్నిహితుడు, ఒకే సామాజికవర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావుని వైసీపీలోకి తెచ్చే భారీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ కి బొత్స దగ్గరుండి తెరతీశారు. సజ్జల ద్వారా ఈ ప్రతిపాదన రావడంతో జగన్ మొదట్లో సానుకూలంగా స్పందించిన తరువాత రాజకీయ వ్యవహారాలను, సమీకరణలు చూసి రెడ్ సిగ్నల్ చూపించారు. అంతే కాదు తెర వెనక బొత్స సత్యనారాయణ ఉన్నారని తెలుసుకుని జగన్ మండిపడినట్లుగా వైసీపీలో చర్చగా ఉంది.

కబ్జాల అడ్డాగా …..

ఇక టీడీపీ హయాంలో గంటా అనుచరులు కబ్జాల అడ్డాగా విశాఖను మార్చేసిన సంగతి విదితమే. అది చాలదన్నట్లుగా ఇపుడు విశాఖ రాజధాని రాబోతోందని తెలిసి ఇంతకు పదింతలు కధ నడపడానికే ఈ చేరికలూ, కూడికలు అని జగన్ తెలుసుకున్నాక మొత్తానికి మొత్తం బ్రేక్ వేసేశారు. పైగా ఇదంతా విజయసాయిరెడ్డిని సైడ్ చేసే కుట్ర అని కూడా తెలియడంతో జగన్ ఒక్కలా రగలడంలేదుట. పార్టీలో అంతా ఒక్క తాటిపైన ఉండాలని జగన్ భావిస్తున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలో సజ్జల వేలు పెట్టడాన్నే ఆయన పెద్ద తప్పుగా చూస్తున్నారు. విజయసాయిరెడ్డి ప్రమేయం లేకుండా ఇంత వ్యవహారం నడపడంతో ముఖ్య పాత్ర పోషించిన బొత్స సత్యనారాయణను నాటి నుంచే జగన్ దూరం పెడుతున్నట్లుగా టాక్ నడుస్తోంది.

తప్పించడం ఖాయమే….

ఇక బొత్స సత్యనారాయణ మంత్రి పదవి ఇపుడు జగన్ చేతిలో ఉందని అంటున్నారు. సీనియర్ మంత్రిగా, నోరున్న, బలమైన సామాజికవర్గం నాయకుడిని, బీసీని క్యాబినెట్లో నుంచి హఠాత్తుగా తప్పించడం సాధ్యమేనా అన్న చర్చ కూడా పార్టీలో సాగుతోందిట. అయితే జగన్ ఇవేమీ పట్టించుకోరని, ఆయన నిర్ణయం తీసుకుంటే అది సూటిగానే ఉంటుందని, దాని పర్యవసానాలు ఎలాంటివైనా ఆయన ఎదుర్కొనేందుకు రెడీ అని అంటున్నారు. అర్జంటుగా బొత్స సత్యనారాయణను తప్పిస్తే ఆ పదవి ఆయన వ్యతిరేక వర్గీయుడైన కోలగట్ల వీరభద్రస్వామికి దక్కుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా విజయనగరం జిల్లాలో బొత్స గ్రూపులు కట్టడం కోలగట్ల లాంటి వారిని తొక్కేయాలని చూడడం జగన్ కీ తెలుసు. ఇపుడు ఏకంగా విజయసాయిరెడ్డి మీదకే బాణాలు వేయడంతో జగన్ తట్టుకోలేకపోతున్నారని టాక్. అంతకు మించి మళ్ళీ దందాలకు వీలుగా ఉత్తరాంధ్రాలో పాత కాపులను పార్టీలోకి చేర్చాలనుకోవడం, పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ట కంటే సొంత రాజకీయమే ముఖ్యం అన్నట్లుగా బొత్స సత్యనారాయణ పోతున్న పోకడలు జగన్ దృష్టిని దాటిపోలేదని అంటున్నారు. మొత్తం మీద బొత్స మీద వేటు కత్తి వేలాడుతోందని వైసీపీ ఇన్నర్ సర్కిల్స్ టాక్.cm

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here