గల్వాన్ వ్యాలీలో చైనా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న భారత్… అమీతుమీకి రెడీ అవుతుందా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. లఢఖ్ లో ఉద్రికత్తల నేపథ్యంలో 38,900కోట్లతో భారీగా యుద్ధ విమానాలు, టెక్నాలజీని కొనుగోలు చేసింది. ఆ మరుసటి రోజే భారత ప్రధాని మోడీ లఢఖ్ లో ఆకస్మికంగా పర్యటిస్తున్నారు.
చైనాతో ఘర్షణలో 21మంది భారత సైన్యం అమరులయ్యారు. దీంతో భారత్ తీవ్ర నిరసన తెలపటంతో పాటు చైనాకు సంబంధించిన యాప్ లను భారత్ నిషేధించింది. ఇక బార్డర్ లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాల సైన్యాధికారులు ఇప్పటికే చర్చలు జరుపుతున్న తరుణంలో ప్రధాని బార్డర్ పర్యటన హీట్ పుట్టిస్తోంది.
బార్డర్ లో పరిస్థితి ఎలా ఉంది అన్న అంశంపై ప్రధాని టాప్ కమాండర్లతో భేటీ కాబోతున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద తాజా పరిస్థితని తెలుసుకోవటంతో పాటు ఘర్షణల తర్వాత ఉన్న వాతావరణం, చైనా లిబరేషన్ ఆర్మీ చర్యలపై తెలుసుకోనున్నారు. భారత సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని, తాము శాంతినే కోరుకుంటున్నా… తమ జోలికి వస్తే సహించేది లేదంటూ భారత జవాన్ల వీర మరణం తర్వాత మోడీ ప్రకటించారు.